ఖానాపూర్, 2026-06-05
ఉపాధ్యాయ వృత్తిని కేవలం బోధనకే పరిమితం చేయకుండా, విద్యార్థుల ఆరోగ్య వికాసానికి, వారి ఆరోగ్య భద్రతకు అంకితభావంతో పనిచేస్తున్నారు మాస్కపూర్ పాఠశాల తెలుగు స్కూల్ అసిస్టెంట్ వెన్నం అంజయ్య. అక్షరాలు నేర్పించే పంతులే... విద్యార్థులకు స్వచ్ఛమైన మంచినీరు అందించే మానవతా మూర్తిగా మారి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

క్రమశిక్షణతో కూడిన సేవ
పాఠశాలలో సుమారు 850 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరందరికీ రోజూ మూడు పూటలా స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉండాలనే సంకల్పంతో అంజయ్య గారు గత 2 సంవత్సరాలుగా విశేష కృషి చేస్తున్నారు. పాఠశాల సమయానికంటే అరగంట ముందే రోజూ బడికి చేరుకుంటారు. అనంతరం ఫిల్టర్లలో పేరుకుపోయిన మురికిని రివర్స్ పంపింగ్ పద్ధతి ద్వారా స్వయంగా శుభ్రం చేసి, వాటర్ ప్లాంట్ ఎల్లప్పుడూ సజావుగా పనిచేసేలా చూసుకుంటున్నారు.
ప్రత్యేక శిక్షణతో సేవ
పాఠశాలలోని వాటర్ ప్లాంట్ సాంకేతిక సమస్యల వల్ల నిలిచిపోకుండా ఉండేందుకు, ఆయన స్వయంగా రెండు రోజుల పాటు ఒక ప్రైవేట్ వాటర్ ప్లాంట్‌కు వెళ్లి ఫిల్టర్ల నిర్వహణ, రిపేర్లు మరియు మెయింటెనెన్స్ మెళకువలను నేర్చుకోవడం విశేషం. ఏమాత్రం స్వార్థం లేని ఈ శ్రమ వెనుక వారి విద్యార్థుల పట్ల ఉన్న ఆత్మీయత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
అంజయ్య మాటల్లో...
వృత్తిధర్మంతో పాటు పిల్లల ఆరోగ్యం కోసం అదనంగా శ్రమపడటంలో నాకు ఎనలేని ఆత్మతృప్తి లభిస్తోంది. విద్యార్థులు కలుషితం కాని స్వచ్ఛమైన నీరు తాగినప్పుడే ఆరోగ్యంగా ఉంటారు, అప్పుడే చదువుపై శ్రద్ధ పెట్టగలరు. అని వెన్నం అంజయ్య తెలిపారు.
అభినందనలు
విద్యార్థుల పట్ల ఆయన చూపుతున్న ఈ వాత్సల్యం, బాధ్యతాయుతమైన సేవలు స్థానిక సర్పంచ్ లక్ష్మీ దయానంద్, ఉపసర్పంచ్ దొనికేని వెంకటేష్ ఇతర ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాడి శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశంసిస్తున్నారు.