జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సమర్థవంతంగా పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు.
గురువారం చెన్నూర్ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, టి.జి.ఎస్.డబ్ల్యూ. రెసిడెన్షియల్ పాఠశాల/జూనియర్ కళాశాల (బాలికలు) లోని పరీక్షా కేంద్రాలను కలెక్టర్ సందర్శించి, పరీక్షల తీరును పరిశీలించారు. జిల్లాలో మార్చి 16వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని, ఇందుకోసం 23 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. మొత్తం 11,000 మందికి పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని వెల్లడించారు.
పరీక్షల నిర్వహణలో భాగంగా ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమించామని, సమన్వయంతో పనిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు, పరీక్ష సమయంలో నిబంధనల అమలు, సమీప జిరాక్స్ సెంటర్ల మూసివేత వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు.
టి.జి.ఎస్.ఆర్.టి.సి. అధికారులు బస్సు సౌకర్యం కల్పించాలని, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని, ప్రతి పరీక్ష కేంద్రంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని, ప్రశ్నాపత్రాల సురక్షిత రవాణాకు తపాలా శాఖ చర్యలు తీసుకోవాలని, పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బంధీగా చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
అనంతరం చెన్నూర్ మండలంలో కొనసాగుతున్న 100 పడగల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను సందర్శించి, పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. వైద్య రంగాన్ని బలోపేతం చేసే దిశగా చేపట్టిన ఈ నిర్మాణాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి అంజయ్య, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


