ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో సీటు సాధించిన యాతలం దీక్షిత రెడ్డిని నిర్మల్లో ఘనంగా సన్మానించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి. సత్యనారాయణ గౌడ్ విద్యార్థినికి అభినందనలు తెలియజేసి, శాలువాతో సత్కరించారు.
నిర్మల్ పట్టణంలోని శాస్త్రి నగర్లో శనివారం జరిగిన కార్యక్రమంలో, ఎల్వి గ్రామానికి చెందిన, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యాతలం చిన్నారెడ్డి కుమార్తె దీక్షిత రెడ్డి సాధించిన ఈ విజయాన్ని పలువురు అభినందించారు.
సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ, దీక్షిత రెడ్డి పట్టుదల, కృషి వల్లే ఈ ఘన విజయం సాధించారని, ఇది ఎంతోమంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని అన్నారు. భవిష్యత్తులో ఆమె సాంకేతిక రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి దేశాభివృద్ధికి దోహదపడాలని ఆకాంక్షించారు.
విద్యార్థిని తండ్రి చిన్నారెడ్డి, కుటుంబ సభ్యులకు కూడా ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రమణ గౌడ్, సుధీర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.












