బాసర ట్రిపుల్ ఐటీలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, వసతి కల్పించాలని OUJAC అధ్యక్షుడు సర్దార్ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. విద్యార్థులకు నాసిరకం ఆహారం, బొద్దింకలు ఉన్న భోజనం అందిస్తున్నారని ఆయన ఆరోపించారు.
నూతన విద్యా సంవత్సరం ప్రారంభం అయినప్పటికీ, బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు నాసిరకం ఆహారం, బొద్దింకలు ఉన్న భోజనం అందిస్తున్నారని OUJAC అధ్యక్షుడు సర్దార్ వినోద్ కుమార్ ఆరోపించారు. ఉన్నత లక్ష్యాలతో ఇక్కడికి వచ్చే విద్యార్థులకు ఇలాంటి పరిస్థితులు ఎదురవడం ఆందోళనకరమని ఆయన అన్నారు.
విద్యార్థులు అల్పాహారంలో బొద్దింకలు వచ్చాయని ఫిర్యాదు చేసినప్పటికీ, మెస్ కాంట్రాక్టు సంస్థపై లేదా బాధ్యులపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా, ఇంచార్జి వీసీ గోవర్ధన్, OSD మురళి దర్శన్ లు బొద్దింకను గుర్తించడానికి కమిటీ వేయడం హాస్యాస్పదమని వినోద్ కుమార్ విమర్శించారు. సమస్యలను పరిష్కరించడానికి బదులు, సమస్యలను సృష్టించేవారే కమిటీలో ఉండటం వింతగా ఉందని ఆయన పేర్కొన్నారు.
OSD పోస్టు అనేది వీసీ పీఏ పోస్టుతో సమానమని, శాశ్వత ప్రొఫెసర్లను పక్కన పెట్టి పీఏలతో కమిటీ వేస్తే, అది కాంట్రాక్టర్లను కాపాడే ప్రయత్నమే అవుతుందని, ముడుపులు తీసుకుని వీరు ఈ పని చేస్తున్నారని ఆరోపించారు. గతంలో ఫుడ్ పాయిజన్ ఘటనలకు పాల్పడిన, బ్లాక్ లిస్ట్ లో ఉన్న సంస్థలకే తిరిగి మెస్ కాంట్రాక్టులు ఇచ్చారని, ఇది ఇంచార్జి వీసీ గోవర్ధన్, OSD మురళి దర్శన్ ల ఘనత అని ఎద్దేవా చేశారు.
గతంలో ఇద్దరు మెస్ కాంట్రాక్టర్ల మధ్య ఆర్థిక వ్యవహారాల విషయంలో జరిగిన కుట్రలో భాగంగా ఫుడ్ పాయిజన్ ఘటనలకు పాల్పడి, విద్యార్థులను ఆసుపత్రి పాలు చేసిన వారికే తిరిగి కాంట్రాక్టులు ముడుపులు తీసుకుని ఇచ్చారని వీసీ, OSD లపై ఆరోపణలు చేశారు. విద్యార్థులు నాసిరకం ఆహారంపై ఫిర్యాదు చేస్తే, ఆ ఫిర్యాదును స్వీకరించి, ఇప్పుడు ఆ కాంట్రాక్టర్లను కాపాడటానికి కొత్త నాటకానికి తెరలేపారని అన్నారు.









