వేల్పూర్ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 17
శివపార్వతులకు ప్రీతికరమైన శ్రావణమాసంలో సోమవారం నాగుల పంచమి సందర్భంగా వేల్పూర్ శివారులోని శ్రీ గోవిందగిరి స్వామి దివ్య యోగాశ్రమంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా జరిగాయి. బెంగళూరుకు చెందిన ఆధ్యాత్మిక ప్రచారకులు శ్రీ రాఘవేంద్ర స్వామి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.
శివపార్వతులకు అత్యంత ప్రీతికరమైన శ్రావణమాసంలో సోమవారం నాగుల పంచమి కలసి రావడంతో వేల్పూర్ శివారులో గల శ్రీ గోవిందగిరి స్వామి దివ్య యోగాశ్రమంలోని శివాలయంలో బెంగళూరుకు చెందిన ఆధ్యాత్మిక ధర్మ ప్రచారకులు శ్రీ రాఘవేంద్ర స్వామి ఆధ్వర్యంలో నాగుల పంచమి సందర్భంగా ఆశ్రమ ప్రాంగణంలో గల పుట్ట వద్ద మహిళలు జొన్న పేలాలు, స్వచ్ఛమైన ఆవుపాలను పుట్టలో పోశారు. తదనంతరం శివాలయములో మహా రుద్రాభిషేకం, బిల్వాభిషేకం, గంగాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు.
శివనామ స్మరణతో మార్మోగిన ఆశ్రమం
ఆలయ ప్రాంగణమంతా శివనామ స్మరణలతో మార్మోగింది. భజన కళాకారులు విశేష భజనలు చేశారు. ఓం నమశ్శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని గంటల తరబడి జపించారు. పూజానంతరం పంచామృతాన్ని భక్తులకు వితరణ చేశారు.
స్వామివారి ఆశీర్వచనం
ఈ సందర్భంగా శ్రీ రాఘవేంద్ర స్వామి మాట్లాడుతూ మహాశివ పంచాక్షరి నామాల్ని ఎంత ఎక్కువ చదివితే అంత పుణ్యం లభిస్తుందని అన్నారు.
అన్నదానం
వేల్పూర్ కు చెందిన బొంపెల్లి హేమలత, గంగాధర్ గుప్తా పుణ్య దంపతులు అన్నదానం చేశారు. నాగుల పంచమి వేడుకల్లో అత్యధికంగా మహిళలు ప్రత్యేక పూజలు చేశారు.
పాల్గొన్న భక్తులు
కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, శివ భక్తులు తదితరులు పాల్గొన్నారు.












