నేరడిగొండ మండలంలోని సేవాలాల్ నగర్లో జగదంబ దేవి, సేవాలాల్ మహారాజ్ విగ్రహం, శిఖర ప్రతిష్ఠాపన మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా జరుగుతోంది. మూడు రోజుల పాటు జరుగుతున్న ఈ వేడుకలకు పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు.
ఏప్రిల్ 27 నుంచి 29 వరకు నిర్వహిస్తున్న ఈ మహోత్సవంలో తొలి రోజు కలశ స్థాపన, గణపతి పూజ, పుణ్యాహవాచనం, మండప పూజ, అఖండ దీపారాధన వంటి ప్రత్యేక పూజలు జరిగాయి. రెండో రోజు దేవతా హోమాలు, శోభాయాత్రలు, భజనలు, ధార్మిక సభలు నిర్వహించి ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు.
మహోత్సవంలో ప్రధాన ఘట్టమైన మూడో రోజున జగదంబ దేవి విగ్రహ ప్రతిష్ఠాపన, శిఖర ప్రతిష్ఠాపన, ధ్వజారోహణం, గరుడవాహనం, తీర్థ ప్రసాదాల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ వేడుకల కారణంగా గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది.
భక్తులు అమ్మవారి దర్శనానికి భారీగా తరలివస్తున్నారు. ఈ కార్యక్రమ విజయవంతం కోసం గ్రామ పెద్దలు, యువకులు, సేవాదళ సభ్యులు సమిష్టిగా కృషి చేస్తున్నారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరుతున్నారు.












