వేల్పూర్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 25
వేల్పూర్ గోవింద గిరి దివ్య యోగాశ్రమంలో జరుగుతున్న సప్త భజన మహోత్సవాల్లో భాగంగా, ఆధ్యాత్మిక ప్రబోధకులు శ్రీ రాఘవేంద్ర స్వామి భజన ప్రాముఖ్యతను వివరించారు. భజన అనేది ఒక సమగ్ర ఆరోగ్య వ్యవస్థ అని, ఇది జీవితాన్ని దైవిక చైతన్యంతో నింపుతుందని ఆయన అన్నారు.
భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతిలో భజనలు అత్యంత లోతైన, ప్రాచీనమైన అభ్యాసాలు. వేల్పూర్ గోవింద గిరి దివ్య యోగాశ్రమంలో 4 రోజులుగా సాగుతున్న సప్త భజన మహోత్సవాల్లో భాగంగా, శనివారం ఆర్మూర్ పట్టణంలోని జెమ్మన్ జెట్టి గల్లీకి చెందిన గంగపుత్ర మహిళా భజన మండలి, బోధన్ సమీపంలోని ఎరాజ్ పల్లి, లక్కోర, ఫత్తేపూర్, రామన్నపేట గ్రామాలకు చెందిన భజన కళాకారుల బృందాలు పాల్గొన్నాయి.
వారు "గురుసేవ చేయలేని శిష్యులు ఉండి లాభమేమి? గురు జ్ఞాన మెరుగని శిష్యులు ఉండి లాభమేమి? అయ్యల్లారా అమ్మల్లారా అందరూ రారండి మీరందరూ రారండి, ఎన్నాళ్లుండిన గింతేనయ్యా అయ్యా నీ కాళ్లు మొక్కుతా" అంటూ తత్వ, భావ, చింతన గీతాలను మృదుమధురంగా ఆలపించారు. వేల్పూర్ కు చెందిన పన్నాల లక్ష్మీ, లక్కోరకు చెందిన బట్టు జమున కుటుంబ సభ్యులు గురుపాదుకపూజను నిర్వహించారు.
పూజ అనంతరం ఆధ్యాత్మిక ప్రబోధకులు శ్రీ రాఘవేంద్ర స్వామి మాట్లాడుతూ, భజన ప్రాముఖ్యత కేవలం భక్తి భావవ్యక్తీకరణకు మించి విస్తరించి ఉందని అన్నారు. భజన ఒక సమగ్ర ఆరోగ్య వ్యవస్థ లాంటిదని, ప్రాచీన ఋషులు పరిశీలించిన దానిని ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఇప్పుడు అంగీకరిస్తోందని తెలిపారు. గానం, లయ, రాగం, భక్తి కలసి అసాధారణమైన పరివర్తన అనుభవాలను సృష్టిస్తాయని, ఈ నాలుగు అంశాలు ఏకమైనప్పుడు జీవితం దైవిక చైతన్యంతో నిండిపోతుందని ఆయన వివరించారు.
సప్త భజన కార్యక్రమంలో మహిళలు ఆనందోత్సాహాలతో వలయాకారంగా తిరుగుతూ సంబురంగా నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, మహిళలు, సాయి సేవకులు, భజన కళాకారులు, భక్తులు పాల్గొన్నారు.











