ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం ఆదివారం శ్రవణ నక్షత్రం, దశమి తిథి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులతో కిటకిటలాడింది. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు.
శ్రవణ నక్షత్రం, దశమి తిథి సందర్భంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు.
వేకువజాము నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. వైదికులు అమ్మవార్లకు అభిషేకం, అర్చనలు, హారతులతో నిత్య కైంకర్యాలను ఘనంగా నిర్వహించారు. అనేక మంది భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరారు.
చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో ఆలయానికి విచ్చేసి, అర్చకుల చేత అక్షరాభ్యాసం, కుంకుమార్చన పూజలు చేయించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు.
ఆలయ ఈఓ విజయ రామారావు తెలిపిన వివరాల ప్రకారం, దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పట్టవచ్చని, భక్తుల సౌకర్యార్థం అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఆలయ పరిసరాలు భక్తిశ్రద్ధలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి.












