నిర్మల్ జిల్లా బాసరలోని వేదభారతి పీఠం ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం గోపూజ, రుద్రాభిషేకం, త్రినాథ వ్రతం, గోహారతి పూజలు ఘనంగా జరిగాయి. శ్రీశ్రీశ్రీ వేద విద్యానంద స్వామీజీ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
వేద విద్యానంద స్వామీజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజా కార్యక్రమాలను వైదిక బృందం సంప్రదాయబద్ధంగా నిర్వహించింది. పట్టణ ప్రముఖులు, గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గోవులకు గోహారతులు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
స్వామీజీ మాట్లాడుతూ, గోమాత అనుగ్రహం వల్ల ఋణబాధలు, సకల దోషాలు తొలగిపోతాయని, సత్సంతాన ప్రాప్తి, శీఘ్ర వివాహం, అష్టైశ్వర్య సిద్ధి కలుగుతాయని తెలిపారు. గోసేవనే సమస్త దోష నివారణకు ఏకైక మార్గమని, పితృదోషాలు సహా అన్ని రకాల సమస్యలు తొలగించడానికి గోరక్షణ, గోసేవ అత్యంత ముఖ్యమని ఆయన వివరించారు.
వేదాలలో గోవును “గావో విశ్వస్య మాతరః” అని కీర్తించిన విషయాన్ని గుర్తుచేస్తూ, గోవు విశ్వానికే తల్లిగా భావించబడుతుందని స్వామీజీ పేర్కొన్నారు. ప్రతి శనివారం నిర్వహించే ఈ పూజా కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వైదికులు కోరారు.








