కుంటాల మండలం వెంకూర్ గ్రామంలో గంజాయి దుష్ప్రభావాలపై అవగాహన కల్పించేందుకు పోలీసులు ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. "గంజా గస్తీ" పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలకు గంజాయి వాడకం వల్ల కలిగే నష్టాలను వివరించారు.
జిల్లా పోలీసు శాఖ ఆదేశాల మేరకు కుంటాల పోలీసులు ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కుంటాల ఎస్సై అశోక్ మాట్లాడుతూ, గంజాయి వినియోగం యువతను తప్పుడు మార్గంలోకి నడిపిస్తుందని, ఇది గ్రామీణ ప్రాంతాల్లో నేరాల పెరుగుదలకు దారితీస్తుందని హెచ్చరించారు.
గంజాయి వినియోగం, సాగు, రవాణా వంటి కార్యకలాపాలు చట్టరీత్యా శిక్షార్హమైనవని ఆయన స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన తెలిపారు.
గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై సూచించారు. గంజాయి రహిత సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్సై అశోక్, పోలీసు సిబ్బంది, గ్రామ సర్పంచ్ సిందే సవిత బాజీరావు, గ్రామస్తులు పాల్గొన్నారు.











