జిల్లాలో గాంజా వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకు నిర్మల్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో, జిల్లా పోలీసు కార్యాలయంలో “గాంజా గస్తీ” బ్యానర్‌ను ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఆవిష్కరించారు.
99 రోజుల ప్రజా ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా, గాంజా వ్యాప్తిని పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా గాంజా వినియోగం, రవాణా, విక్రయాలపై కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేసి, ప్రత్యేక బృందాల ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. యువతను మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడేందుకు అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నట్లు చెప్పారు.
“గాంజాను పూర్తిగా తరిమికొడతాం… జిల్లాలో మాదక ద్రవ్యాలకు చోటు లేకుండా చేస్తాం” అని ఎస్పీ డా. జానకి షర్మిల స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రజల సహకారం అత్యంత కీలకమని ఆమె పేర్కొన్నారు.
ఎక్కడైనా గాంజా విక్రయాలు లేదా వినియోగం జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఎస్పీ హామీ ఇచ్చారు.











