మండల కేంద్రమైన ముధోల్ లోని సాయి నగర్ ప్రాంతంలో ఐసీఐసీఐ బ్యాంక్ ఎదురుగా పెద్ద మొత్తంలో ఇసుక డంప్ చేయబడింది. ఈ వ్యవహారంపై అధికారులు స్పందించకపోవడం, నిబంధనల అమలు తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ముధోల్ పట్టణంలోని సాయి నగర్ లో ఐసీఐసీఐ బ్యాంక్ సమీపంలో సుమారు 7 నుండి 8 పెద్ద వాహనాల సామర్థ్యం మేరకు ఇసుక డంప్ చేయబడింది. శుక్రవారం ఉదయం నుండి ఈ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ, దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
ప్రభుత్వ అనుమతులతో ఇసుక తరలింపు జరుగుతోందా లేక అక్రమ మార్గాల్లో వస్తోందా అనే దానిపై స్పష్టత లేదని, దీనిపై పరిశీలించాల్సిన అధికారులు మౌనం వహించడం విమర్శలకు తావిస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక అనుమతులు కష్టతరం చేస్తున్న అధికారులు, ప్రైవేట్ నిర్మాణాలకు ఇసుక ఎలా వస్తుందో పట్టించుకోకపోవడం పక్షపాత ధోరణిని సూచిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
గతంలో కూడా ముధోల్ లో ఇసుక తరలింపు వ్యవహారంలో వివాదాలు తలెత్తిన నేపథ్యంలో, ప్రస్తుత భారీ డంపింగ్ పై అధికారులు ఎందుకు స్పందించడం లేదనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇది అధికారుల నిబద్ధతపై అనుమానాలను బలపరుస్తోందని పలువురు పేర్కొంటున్నారు.
నియమ నిబంధనలు అందరికీ సమానంగా వర్తింపజేయాలని, ఈ విషయంలో పారదర్శకత పాటించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయంపై తహసీల్దార్ ను సంప్రదించగా, ఆయన సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు.











