ముధోల్, 2026-08-22
ముధోల్ నియోజకవర్గంలో సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన కేసులో రైస్‌మిల్ యజమాని సోమనాథ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు 3,131 టన్నుల ధాన్యం విలువ రూ.16.21 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ముధోల్ నియోజకవర్గంలో ఓ రైస్‌మిల్ యజమాని రెండు సంవత్సరాలకు సంబంధించిన సీఎంఆర్ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి, ప్రభుత్వానికి బియ్యం అప్పగించకుండా పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. సుమారు 3,131 టన్నుల సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు సివిల్ సప్లై అధికారులు గుర్తించారు.
విలువైన ధాన్యం
2023-24, 2024-25 సంవత్సరాలకు సంబంధించిన సీఎంఆర్ ధాన్యాన్ని ప్రభుత్వానికి అప్పగించడంలో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. పక్కదారి పట్టిన ధాన్యం విలువ సుమారు రూ.16 కోట్ల 21 లక్షల 98,874గా ఉన్నట్లు సమాచారం.
పోలీసులకు ఫిర్యాదు
ఈ వ్యవహారంపై నిర్మల్ జిల్లా సివిల్ సప్లై డీఎం శనివారం ముధోల్ పోలీస్ స్టేషన్లో రైస్‌మిల్ యాజమానిపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా ముధోల్ పోలీసులు రైస్‌మిల్ యజమాని సోమనాథ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
అధికారుల స్పందన
ఈ విషయంపై ముధోల్ సీఐ రవీందర్ నాయక్‌ను వివరణ కోరగా సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టిన విషయం వాస్తవమేనని తెలిపారు. రైస్‌మిల్ యజమాని సోమనాథ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆదివారం వెల్లడిస్తామని సీఐ తెలిపారు.












