జిల్లా కేంద్రంలోని శ్రీరామ్ నర్సింగ్ హోంలో వైద్య నిర్లక్ష్యం కారణంగా దళిత మాదిగ కులానికి చెందిన గర్భిణి వాణిశ్రీ ప్రాణాపాయ స్థితికి చేరుకుందని ఆరోపిస్తూ దళిత సంఘాల నాయకులు సోమవారం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధితులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు.
వాణిశ్రీకి నిర్వహించిన ఆపరేషన్ విఫలమై, ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ప్రస్తుతం నాగ్‌పూర్‌లో చికిత్స పొందుతున్నట్లు బాధితుల సంఘం నాయకులు తెలిపారు. ఆసుపత్రి యాజమాన్యం, వైద్యుల సంఘం ప్రతినిధులు మొదట వైద్య ఖర్చుల్లో 50 శాతం భరిస్తామని హామీ ఇచ్చి, అనంతరం తమపైనే అక్రమ కేసులు నమోదు చేయించారని వారు ఆరోపించారు.
చర్చల పేరుతో పిలిచి కులం పేరుతో దూషించడమే కాకుండా, జిల్లా అధికారులు, ఎస్పీలను కలుస్తామని చెప్పినందుకు బెదిరింపులకు పాల్పడ్డారని సంఘం నాయకులు పేర్కొన్నారు. బాధితులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేసి, ఆసుపత్రిలో జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరపాలని వారు కోరారు.
డాక్టర్ శ్యామల రాణి, సత్యనారాయణతో పాటు పలువురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. డాక్టర్ శ్యామల రాణి వైద్య అర్హతలను పరిశీలించి, అవసరమైతే వైద్య ధ్రువపత్రాన్ని రద్దు చేయాలని కోరారు.
ఎస్పీ సానుకూలంగా స్పందించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు సంఘాల నాయకులు తెలిపారు. ఈ ఫిర్యాదులో పలువురు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.












