సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని, అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.
నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో బుధవారం సాయంత్రం జరిగిన సమీక్షా సమావేశంలో, ఈ నెల 20న ఖానాపూర్ పట్టణంలో జరగనున్న జయంతి వేడుకలకు సంబంధించి ఏర్పాట్లపై కలెక్టర్ అధికారులతో చర్చించారు. వేడుకలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలని ఆదేశించారు.
అలాగే, వేడుకల ప్రదేశంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రజల రాకపోకల కోసం రవాణా సౌకర్యం కల్పించడంతో పాటు, వాహనాల పార్కింగ్‌కు ఇబ్బందులు లేకుండా చూడాలని, తగిన పోలీసు బందోబస్తు, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తత ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
వేడుకలకు హాజరయ్యే వారికి భోజన ఏర్పాట్లు చేయాలని, జయంతి సందర్భంగా నిర్వహించే ర్యాలీకి కూడా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో డిఎఫ్ఓ, ఆర్డిఓ, వైద్యారోగ్య శాఖ అధికారి, తహసిల్దార్, మున్సిపల్ కమిషనర్, గిరిజనాభివృద్ధి శాఖ అధికారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

