నిర్మల్ జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం, పోలీసు శాఖలో సుదీర్ఘకాలం పాటు సేవలందించి పదవీ విరమణ పొందిన నలుగురు ఏఎస్ఐలకు జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఘనంగా సన్మానించారు. వారి సేవలను కొనియాడుతూ జ్ఞాపికలు అందజేశారు.
పదవీ విరమణ చేసిన అధికారులలో బి. డల్లు సింగ్, జి. శంకర్, జెడ్. మారుతి, బి. నారాయణ రెడ్డి ఉన్నారు. వీరంతా సుమారు 40 సంవత్సరాల పాటు పోలీసు శాఖలో కానిస్టేబుల్ గా తమ సేవలను ప్రారంభించి, ఉన్నత స్థాయికి చేరుకొని, ప్రజల భద్రత కోసం కృషి చేశారు.
జిల్లా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ, పదవీ విరమణ చేసిన అధికారులు పోలీసు శాఖకు అందించిన సేవలు ప్రశంసనీయమని, వారి నిబద్ధత, క్రమశిక్షణ యువ పోలీసులకు ఆదర్శమని అన్నారు. వారి సేవలను ఎప్పటికీ గుర్తుంచుకుంటామని తెలిపారు.
ఎస్పీ అధికారుల ఆరోగ్యం, కుటుంబ పరిస్థితుల గురించి ఆప్యాయంగా అడిగి తెలుసుకుని, భవిష్యత్తులో మంచి ఆరోగ్యం, శాంతియుతమైన జీవితం గడపాలని ఆకాంక్షించారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏవో యూనుస్ అలీ, పోలీస్ ఆఫీసర్స్ అధ్యక్షులు విరాసత్ అలీ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.








