నిర్మల్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అమలు జరుగుతున్న 'పోలీస్ అక్క (నారిశక్తి)' కార్యక్రమానికి జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకమైన స్కోచ్ అవార్డు లభించింది. ఈ నేపథ్యంలో, జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం ఘనంగా సంబరాలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీస్ అక్కలను ఘనంగా సత్కరించారు.
స్కోచ్ అవార్డు అందుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ, పోలీస్ అక్క కార్యక్రమంలో భాగస్వాములైన మహిళా పోలీస్ సిబ్బందిని అభినందించారు. వారి కృషి, నిబద్ధత వల్లే ఈ కార్యక్రమం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని తెలిపారు. విద్యార్థినులు భయపడకుండా తమ సమస్యలను పంచుకునే వాతావరణం ఏర్పడడం ఈ కార్యక్రమ విజయంగా ఆమె పేర్కొన్నారు.
పోలీస్ అక్క కార్యక్రమం మహిళా పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో నడిచే కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమం. ఇందులో భాగంగా బాలికలకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, మహిళల భద్రత, సైబర్ సెక్యూరిటీ, పోక్సో చట్టం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో పెట్రోలింగ్, డయల్-100 ద్వారా అత్యవసర సేవలు అందిస్తూ మహిళలకు తక్షణ సహాయం చేస్తున్నారు.
కేజీబీవీ పాఠశాలల్లో నెలకు ఒకసారి రాత్రి బస చేసి విద్యార్థినుల సమస్యలు విని, కౌన్సిలింగ్ అందించడం వంటి కార్యకలాపాలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 7,000 మంది విద్యార్థినులు, మహిళలు నేరుగా లబ్ధి పొందారు. సమస్యలను భయపడకుండా చెప్పుకునే నమ్మకం వారిలో పెరిగింది. మహిళల భద్రత, అవగాహన, సాధికారత కోసం ఈ కార్యక్రమం సమర్థవంతంగా పనిచేస్తూ సమాజంలో సానుకూల మార్పుకు దోహదపడుతోంది.
ఈ సందర్భంగా పోలీస్ అక్కలు జిల్లా ఎస్పీ జానకి షర్మిలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తమ సేవా అనుభవాలను పంచుకుంటూ, సమాజంలో మహిళలకు అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. మహిళల భద్రత, అవగాహన, సాధికారత కోసం పోలీస్ అక్క కార్యక్రమం మరింత ప్రభావవంతంగా కొనసాగుతుందని అన్నారు. ఈ అవార్డు గౌరవంతో పాటు బాధ్యతను కూడా పెంచిందని, ఇకపై మరింత మెరుగైన సేవలు అందిస్తూ ప్రతి బాలికకు భద్రత, నమ్మకం కల్పించడమే నిర్మల్ జిల్లా ప్రతి పోలీస్ అక్కల లక్ష్యమని ఎస్పీ జానకి షర్మిల తెలిపారు.











