వివిధ ప్రాంతాలు (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 09
ఆదివాసీలకు నూరుశాతం ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించే జిఒ 3 పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ జిఒ జారీ, 1/70 చట్టం అమలు వంటి డిమాండ్లతో ఆదివాసీ గిరిజన సంఘాలు, ప్రజా సంఘాలు పిలుపునిచ్చిన మన్యం బంద్ విజయవంతమైంది. ఈ బంద్ కారణంగా అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాలతో పాటు పలు ఏజెన్సీ ప్రాంతాల్లో వ్యాపారాలు, విద్యాసంస్థలు, పర్యాటక ప్రాంతాలు మూతపడ్డాయి.
ఆదివాసీలకు నూరుశాతం ఉద్యోగ రిజర్వేషన్ కల్పించే జిఒ 3ను పునరుద్ధరించాలని, లేదా ప్రత్యామ్నాయ జిఒ తేవాలని, 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, ఇతర గిరిజన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ గిరిజన సంఘం, జిఒ నెంబర్ 3 రిజర్వేషన్ సాధన, 1/70 చట్టం పరిరక్షణ పోరాట కమిటీ, పలు ఆదివాసీ, ప్రజా సంఘాలు శనివారం నిర్వహించిన మన్యం బంద్ విజయవంతమైంది. అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో అన్ని రకాల వ్యాపార సంస్థలు, దుకాణాలు, హోటళ్లు, బ్యాంకులు, విద్యాసంస్థలు, పెట్రోల్ బంక్‌లు మూతపడ్డాయి. అరకులోయలోని గిరిజన సాంస్కృతిక మ్యూజియం, పద్మావతి గార్డెన్స్, అనంతగిరిలోని బొర్రా గుహలు సహా ఏజెన్సీలోని అన్ని పర్యాటక ప్రాంతాలు మూతపడ్డాయి. ఆర్టిసి బస్సులను పోలీసు బందోబస్తుతో నడపాలని ప్రయత్నించినా ఆందోళనకారులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.
గిరిజన సంఘాల డిమాండ్లు
అరకులోయలో ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర మాట్లాడుతూ.. ఆదివాసీ చట్టాలు, హక్కుల జోలికొస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జిఒ నెంబర్ -3కి ప్రత్యామ్నాయంగా వెంటనే ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆరు నెలల్లో చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు అరకులోయకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు 1/70 చట్టం పరిరక్షణకు, జిఒ నెంబర్ 3 పునరుద్ధరణకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని అన్నారు. గత నెల 17న పాడేరులో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజా సంఘాల నాయకులపై, ఉద్యోగులపై కేసులు పెట్టడం శోచనీయమన్నారు.
ఉద్యోగ అవకాశాలపై ప్రభావం
అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మాట్లాడుతూ, జిఒ 3 లేకపోవడంతో ఆదివాసీలకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. పాడేరులో బంద్‌ను ఉద్దేశించి ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ కార్యవర్గ సభ్యులు పి.అప్పలనర్స మాట్లాడుతూ జిఒ 3 రద్దుతో డిఎస్సి- 2025లో గిరిజన నిరుద్యోగులు ఉద్యోగావకాశాలు కోల్పోయారని తెలిపారు. డిఎస్సి-2026 లో అదే పరిస్థితి పునరావృతం కాకుండా తక్షణమే ప్రత్యామ్నాయ జిఒ జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తమ ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.
ఉద్యమ స్ఫూర్తి
ముంచంగిపుట్టు మండల కేంద్రంలో వర్షాన్ని కూడా లెక్క చేయకుండా బంద్ కొనసాగడం ఆదివాసీల ఉద్యమ స్ఫూర్తికి అద్దం పట్టింది. పోలవరం జిల్లాలో పోలీసులకు, ఆదివాసీలకు మధ్య పలుచోట్ల వాగ్వాదం చోటుచేసుకుంది. రంపచోడవరంలో ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు, రాష్ట్ర నాయకులు బొప్పెన కిరణ్ తదితరులు పాల్గొన్నారు.











