వివిధ జిల్లాలు (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 10
ఆదివాసీల హక్కులు, చట్టాలను తుంగలో తొక్కేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని, ఈ నేపథ్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ స్ఫూర్తితో గిరిజనులంతా పోరాటాలకు సిద్ధం కావాలని ఆదివాసీ సంఘాల నేతలు పిలుపునిచ్చారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో పలు జిల్లాల్లో ప్రదర్శనలు, సభలు నిర్వహించారు.
ఆదివాసీల హక్కులు, చట్టాలను కాలరాసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని, ఈ నేపథ్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ స్ఫూర్తితో గిరిజనులంతా పోరాటాలకు సిద్ధం కావాలని ఆదివాసీ సంఘాల నేతలు పిలుపునిచ్చారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యాన అల్లూరి, పోలవరం, పార్వతీపురం మన్యం, ఏలూరు జిల్లాల్లో ఆదివారం ప్రదర్శనలు, సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఆదివాసీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఉద్యోగ రిజర్వేషన్లపై డిమాండ్
అల్లూరి జిల్లా అనంతగిరిలో హరిత హిల్ రిసార్టు వద్ద నిర్వహించిన సభలో ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర మాట్లాడుతూ ఏజెన్సీలో ఆదివాసీలకు వంద శాతం ఉద్యోగ రిజర్వేషన్ కల్పించే జిఒ 3ని పునరుద్ధరించాలని లేదా ప్రత్యామ్నాయంగా జిఒ తీసుకొచ్చి చట్టబద్ధతకు ఆర్డినెన్సు జారీ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 1/70 చట్టం పరిరక్షణకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని, కమిటీల పేరుతో కాలయాపన చేయడం తగదన్నారు. సభకు ముందు కొత్తవలస బాలుర పాఠశాల వద్ద ప్రారంభమైన ర్యాలీ థింసా నృత్యంతో ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం జెడ్పిటిసి సభ్యులు దీసరి గంగరాజు, ఎంపిపి తడబరికి మెత్తుల తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేట్లకు అడవుల ధారాదత్తంపై విమర్శలు
పాడేరులోని ఎపిటిఎఫ్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ కార్యవర్గ సభ్యులు పి.అప్పలనర్స మాట్లాడుతూ ఆదివాసీల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో అడవులను కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తోందన్నారు. గత ఎన్నికల సమయంలో ఆదివాసీలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 2026 అక్టోబర్లో నిర్వహించే డిఎస్సిలో ఆదివాసీ యువతకు శతశాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు. ఆదివాసీ మహిళా ఉద్యమ నేత కాంగు శుభ, గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ పాల్గొన్నారు.
పోలవరం జిల్లాలో భారీ ప్రదర్శన
పోలవరం జిల్లా రాజవొమ్మంగిలో ఆదివాసీ గిరిజన సంఘం, గిరిజన ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గిరిజనులు భారీ ప్రదర్శన నిర్వహించారు. అల్లూరి జంక్షన్ వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. గిరిజనుల హక్కులు, చట్టాలు, ఐక్యతపై నినదించారు. ఆట, పాటలు, నృత్యాలతో అలరించారు. ఆర్అండ్బి అతిథి గృహం వద్ద ఆదివాసీ జెండాను నేతలు ఆవిష్కరించారు. అనంతరం బహిరంగ సభలో ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు మాట్లాడుతూ ఆదివాసీ హక్కుల పరిరక్షణతో పాటు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.












