మానసిక ఒత్తిడి, దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు నిత్యం వాకింగ్ చేయడం అత్యంత ప్రయోజనకరమని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి పేర్కొన్నారు. నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో మార్నింగ్ వాక్ అసోసియేషన్ సభ్యులతో కలిసి ఆయన వాకింగ్ చేశారు.
ఈ సందర్భంగా, వాకింగ్ చేసేవారి అవసరాలు, సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఎన్టీఆర్ మినీ స్టేడియంలో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు, ఓపెన్ జిమ్ మెరుగుదల, సాయంత్రం వేళల్లో వాకింగ్ చేసేవారికి మెరుగైన లైటింగ్ ఏర్పాట్లు వంటి సౌకర్యాలు కల్పించేందుకు మున్సిపల్ యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
అలాగే, క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా నిర్మల్ పట్టణంలో మరో అత్యాధునిక స్టేడియం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరనున్నట్లు తెలిపారు.
మార్నింగ్ వాక్ అసోసియేషన్ సభ్యులు ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్‌ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.











