వేసవిలో విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు పాఠశాలల్లో 'వాటర్ బెల్' కార్యక్రమం అమలు చేయడం ఎంతో ప్రయోజనకరమని గాంధీ బాలా సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జాధవ్ పుండలిక్ రావు పాటిల్ అన్నారు. మంగళవారం స్థానిక శ్రీ గౌతమి హైస్కూల్లో ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
వేసవిలో చెమట, మూత్ర విసర్జన ద్వారా శరీరంలోని నీటి శాతం తగ్గిపోయి, విద్యార్థులు డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉందని పాటిల్ తెలిపారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు నీటి అవసరంపై అవగాహన తక్కువగా ఉంటుందని, ఆటల వల్ల నీరసించిపోతారని ఆయన పేర్కొన్నారు.
పాఠశాలల్లో ప్రతి పీరియడ్‌కు ఒకసారి విద్యార్థులు నీరు తాగేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని ఆయన సూచించారు. శరీరంలో తగినంత నీరు ఉండటం వల్ల జీర్ణక్రియ, మెదడు వ్యవస్థ చురుకుగా పనిచేస్తాయని, నీటి సమతుల్యత లోపిస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు.
ప్రతిరోజూ తగిన మోతాదులో నీరు తాగడం ద్వారా విద్యార్థులు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని, ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా పిల్లలు తాగే నీటిపై శ్రద్ధ చూపాలని సూచించారు. వేసవిలో మధ్యాహ్న వేళ ఎండలో తిరగకుండా, ఉదయం, సాయంత్రం వేళల్లోనే ఆడుకోవాలని విద్యార్థులకు సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


