తెలంగాణ రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలు రేపటి నుంచి పెరగనున్నాయి. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. శాస్త్రీయంగా, హేతుబద్ధంగా ఈ విలువలను సవరించినట్లు మంత్రి తెలిపారు.
రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, భూముల విలువల సవరణ ప్రక్రియను క్షుణ్ణంగా అధ్యయనం చేశామని, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా కొత్త విలువలు నిర్ణయించామని వెల్లడించారు. నిపుణుల సూచనలు, అధికారుల సలహాల మేరకు ఈ మార్పులు చోటు చేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు.
వాస్తవ మార్కెట్ విలువలకు, ప్రభుత్వ విలువలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. గతంలో ఈ వ్యత్యాసాల వల్ల భూ లావాదేవీల్లో అనేక సమస్యలు తలెత్తాయని, వాటిని పరిష్కరించేందుకే 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో మార్కెట్ విలువల పునఃసమీక్ష నిర్వహించినట్లు వివరించారు.
కొత్త విలువలను నిర్ణయించేటప్పుడు ప్రాంతాల అభివృద్ధి అవకాశాలు, వృద్ధి రేటు, ఇటీవల జరిగిన భూముల లావాదేవీలు, వేలంపాటలు, డిమాండ్, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే అధిక విలువలున్న ప్రాంతాల్లో ధరల పెంపు ప్రతిపాదించలేదని స్పష్టం చేశారు.











