సారంగాపూర్ మండలంలో ఇసుక, మొరం, మట్టి అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోందని, దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లడమే కాకుండా భూగర్భ జలాలు తగ్గిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మండలంలోని వాగులు, నది పరివాహక ప్రాంతాలు, కాలువల సమీపంలో అక్రమ ఇసుక తరలింపు జరుగుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆలూరు, బోరిగం, బీరవెల్లి, యాకర్పల్లి, వంజర్, తాండ్ర, ధోనిగం, కాంకేట, చించోలి, సారంగాపూర్ తదితర గ్రామాల నుంచి పగలు, రాత్రి తేడా లేకుండా ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా ఇసుక, మొరం రవాణా జరుగుతోందని పేర్కొంటున్నారు.
రాత్రి వేళల్లో వ్యవసాయ పొలాల్లో ఇసుకను డంప్ చేసి, అక్కడి నుంచి మహారాష్ట్రలోని బోత్ ప్రాంతానికి తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ దందాకు కొందరు అధికారుల అండదండలు ఉన్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి.
అక్రమ రవాణా కారణంగా ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లుతోందని, అదే సమయంలో వాగుల నుంచి పెద్ద మొత్తంలో ఇసుక తరలించడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ దందాకు సహకరిస్తున్న అధికారులపై విచారణ జరపాలని గ్రామస్తులు ఉన్నతాధికారులను కోరుతున్నారు.












