సంగారెడ్డి జిల్లా కొండపూర్ మండలం మారేపల్లిలో ఒక వ్యక్తి తన భార్యను హత్య చేసి, ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. బైక్ కొనివ్వడం లేదనే కారణంతో ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే, మారేపల్లికి చెందిన దాసరి అంజయ్య (25)కు 11 నెలల క్రితం నారాయణఖేడ్ మండలం సంజీవ్రావుపేటకు చెందిన యాదమ్మ (20)తో వివాహం జరిగింది. వివాహానంతరం మారేపల్లి శివారులో మామిడి తోటను కౌలుకు తీసుకుని జీవనం సాగిస్తున్నారు.
అంజయ్య మద్యానికి బానిసై, అత్తింటివారు బైక్ కొనివ్వాలని భార్యతో తరచూ గొడవ పడుతుండేవాడని సమాచారం. ఈ క్రమంలో శుక్రవారం వీరిద్దరి మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది.
గొడవలో ఆగ్రహానికి గురైన అంజయ్య, ఆవేశంలో యాదమ్మను గదిలో చున్నీతో ఉరివేసి హత్య చేశాడు. అనంతరం, పోలీసుల భయంతో సమీపంలోని మామిడి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాద ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.








