భైంసా పట్టణంలోని ప్రధాన బస్ స్టాండ్‌లో ప్రయాణికుల భద్రత కరువైందని, తక్షణమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ముధోల్ నియోజకవర్గ యువ నాయకులు కాంబ్లే సాహెబ్ రావు డిమాండ్ చేశారు. శనివారం మధ్యాహ్నం జరిగిన మొబైల్ చోరీ ఘటనతో ఈ అంశంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
శనివారం మధ్యాహ్నం బస్ స్టాండ్‌లో ముగ్గురు ప్రయాణికుల మొబైల్ ఫోన్లు చోరీకి గురయ్యాయి. ఈ ఘటన సమయంలో బస్ స్టాండ్‌లో ఒక్క పోలీస్ అధికారి కూడా అందుబాటులో లేకపోవడం గమనార్హం. కాంబ్లే సాహెబ్ రావు స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి ఘటన స్థలానికి రప్పించినట్లు తెలిపారు.
బస్ స్టాండ్‌లో సీసీ కెమెరాలు లేకపోవడం, బాధితులకు ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలని సూచించడం బాధ్యతారాహిత్యమని ఆయన విమర్శించారు. రోజూ వేలాది మంది మహిళలు, విద్యార్థినులు, వృద్ధులు రాకపోకలు సాగించే బస్ స్టాండ్‌లో కనీస భద్రతా వ్యవస్థ లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని ఆయన అన్నారు.
“ఈరోజు మొబైల్ ఫోన్లు పోయాయి, రేపు మహిళల భద్రతకు ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది?” అని ఆయన ప్రశ్నించారు. సీసీ కెమెరాలు లేకుండా న్యాయం ఎలా సాధ్యమవుతుందని ఆయన నిలదీశారు.
పోలీస్ శాఖ మరియు ఆర్టీసీ అధికారులు తక్షణమే స్పందించి భైంసా బస్ స్టాండ్ పరిసరాల్లో ఆధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, అలాగే ప్రయాణికుల భద్రత కోసం అవుట్‌పోస్ట్ సిబ్బందిని నిరంతరం అందుబాటులో ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు.












