రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక' 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై నిర్మల్ జిల్లాలో శిక్షణా, అవగాహన కార్యక్రమం జరిగింది. ఇందులో ప్రజా ప్రతినిధుల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు.
నిర్మల్ పట్టణంలోని తిరుమల గార్డెన్స్‌లో గురువారం జరిగిన ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు రూపొందించిన ఈ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను గ్రామ, పట్టణ స్థాయిల్లో సమన్వయంతో అమలు చేయాలని ఆమె సూచించారు.
గ్రామ సర్పంచ్‌లు, మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్మన్లు, వార్డు కౌన్సిలర్లు తమ పరిధిలోని ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో చురుగ్గా పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజా ప్రతినిధులు క్రియాశీలకంగా వ్యవహరించడం ద్వారా ప్రభుత్వ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు చేరేలా చూడాలని ఆమె కోరారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, వెడ్మ బొజ్జు పటేల్, రామారావు పటేల్, జిల్లా అధికారులు, మున్సిపల్ ప్రజా ప్రతినిధులు, గ్రామ సర్పంచ్‌లు, వార్డు కౌన్సిలర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజా ప్రతినిధులకు కార్యాచరణ ప్రణాళికపై అవగాహన కల్పించారు.


