నిర్మల్, జూన్ 29
భారీ వర్షాలు, వరదలు సంభవించినప్పుడు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వరదల నివారణ చర్యలపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
భారీ వర్షాలు, వరదలు సంభవించిన సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.
వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వరదల నివారణ చర్యలపై సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాలు, ఆకస్మిక వరదల నుంచి ప్రజలను రక్షించేందుకు ముందస్తు ప్రణాళిక అవసరమని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, వైద్య ఆరోగ్య, రహదారుల శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
భారీ వర్షాల సమయంలో సమాచార మార్పిడి ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ప్రాజెక్టుల పరివాహక ప్రాంతాలు, చెరువుల పరిసరాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలకు వాతావరణ పరిస్థితులు, నీటి మట్టాల వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆదేశించారు.
స్థానిక ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు. కుంగిపోయిన రోడ్లు, గుంతలు, ప్రమాదకర ప్రవాహాలు ఉన్న ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ప్రాజెక్టుల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, గేట్లు ఎత్తే ముందు పరిసర ప్రాంతాల ప్రజలకు ముందస్తు సమాచారం అందించాలని ఆదేశించారు.
వరద ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాల ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, గర్భిణులు, తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారికి అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించాలని సూచించారు.
విద్యుత్ అంతరాయం, రోడ్ల నష్టం వంటి సమస్యలు తలెత్తితే వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టేందుకు శాఖల అధికారులు సిద్ధంగా ఉండాలని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల మాట్లాడుతూ భారీ వర్షాలు, వరదల సమయంలో ప్రమాదకర ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీస్ సిబ్బందితో భద్రత చర్యలు చేపడతామని తెలిపారు.
లోతట్టు ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, అత్యవసర పరిస్థితుల్లో రెవెన్యూ తదితర శాఖలతో సమన్వయం చేసుకుంటామని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, డీఆర్ఓ రాథోడ్ రమేష్, ఆర్డీఓ దేవీదాస్, డీఎస్పీ శ్రీనివాస్, ఎన్డీఆర్ఎఫ్ అధికారులు, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.












