పెద్దపల్లి, 22 July
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి పోలీసులు సకాలంలో సహాయం అందించి ప్రాణాలు కాపాడారు. వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ సిబ్బంది మానవతా దృక్పథంతో స్పందించి బాధితులను ఆసుపత్రికి తరలించారు.
ప్రజా భద్రత, నేరాల నియంత్రణతో పాటు ప్రాణరక్షణలోనూ పోలీసులు ముందుంటారని నిరూపించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జోన్, గోదావరిఖని ఎన్టీపీసీ క్రషర్‌నగర్ రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ సిబ్బంది తక్షణ సహాయం అందించి ఆసుపత్రికి తరలించారు.
వివరాల్లోకి వెళితే, గోదావరిఖని వైపు వస్తున్న ఓ లారీ టైరు పంక్చర్ కావడంతో రోడ్డుపై నిలిపి ఉంచారు. అదే సమయంలో ఛత్తీస్‌గఢ్ వైపు వెళ్తున్న డీసీఎం వ్యాన్ వెనుక నుంచి ఆ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు డీసీఎం వ్యాన్ క్యాబిన్ పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదంలో క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు.
నైట్ పెట్రోలింగ్‌లో ఉన్న వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, సకాలంలో చికిత్స అందేలా చర్యలు చేపట్టారు.
అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడేందుకు కూడా పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని ఈ ఘటన మరోసారి నిరూపించింది. ప్రమాద బాధితులకు సకాలంలో సహాయం అందించిన పోలీసు అధికారుల సేవలను స్థానిక ప్రజలు అభినందించారు.












