ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయవరం క్వారీల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, టిప్పర్ ఢీకొన్న ఘటనలో 10 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు.
ఈ దుర్ఘటన తెల్లవారుజామున చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా పామూరు వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ను ఢీకొట్టింది. ఈ ఢీకొన్న ధాటికి టిప్పర్ డీజిల్ ట్యాంక్ పగిలిపోవడంతో రెండు వాహనాల్లోనూ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు అంచనా. మంటలు చెలరేగడంతో బస్సులో ఉన్నవారు బయటకు వచ్చేలోపే మంటల్లో చిక్కుకున్నారు. కొందరు కిటికీలు పగులగొట్టుకుని బయటపడగా, లోపల చిక్కుకున్న 10 మంది అక్కడికక్కడే మరణించారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చి, క్షతగాత్రులను సమీపంలోని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతివేగం, అజాగ్రత్తే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది.








