మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో బిల్లా మహేందర్ (45) అనే వ్యక్తి మృతి చెందాడు. రోడ్డుపై ఆగి ఉన్న టిప్పర్ లారీని అతని బైక్ ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.
మందపల్లి గ్రామానికి చెందిన బిల్లా మహేందర్, మంచిర్యాల నుండి జన్నారం వైపు తన బైక్ పై వెళ్తుండగా, తపాలాపూర్ చెక్పోస్ట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆగి ఉన్న లారీని గమనించకపోవడంతో బైక్ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో మహేందర్ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మరణించాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దుఃఖంలో ఉన్నారు. ఈ ఘటనపై జన్నారం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై జి.ఉదయ్ కిరణ్ వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు.








