జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో, రాబోయే వారం రోజుల పాటు వేడి గాలుల తీవ్రత అధికంగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు.
సాధారణ స్థాయికి మించి 1.5°C నుండి 3.5°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. ఈ నేపథ్యంలో, పట్టణాలు, గ్రామాలు, ట్రాఫిక్ కూడళ్ల వద్ద అవసరమైన ప్రదేశాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. స్వచ్ఛంద సంస్థలను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని సూచించారు.
చలివేంద్రాల్లో ప్రజలకు తాగునీటితో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, తగినంత నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు, అనారోగ్యంతో ఉన్నవారు మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలని విజ్ఞప్తి చేశారు.
జిల్లాలో హీట్‌వేవ్ యాక్షన్ ప్లాన్‌ను అత్యవసరంగా సిద్ధం చేసి అమలు చేయాలని, భారత వాతావరణ శాఖ వెబ్సైట్ ద్వారా వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు అప్రమత్తంగా ఉండాలని, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, డీహైడ్రేషన్ చికిత్సకు అవసరమైన ఔషధాలను సిద్ధంగా ఉంచాలని తెలిపారు.








