యాదాద్రి భువనగిరి, 2026-08-15
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశం వేడుకల్లో మునిగి తేలుతుంటే, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీమతి మంజుల పత్తిపాటి మాత్రం అనాథల ఆవేదన, రైతుల కష్టాలను గుర్తు చేశారు. నిజమైన స్వాతంత్ర్యం అంటే ఏమిటో ఆమె తన రచన ద్వారా వివరించారు.
స్వాతంత్ర్య దినోత్సవం నాడు స్వేచ్ఛా గీతాలు పాడుతున్న వేళ, ఒక మూలన అనాథ బాల్యం అమ్మ ఒడిని వెతుకుతూ ఏడుస్తోంది. తండ్రి నీడ కోసం తపిస్తూ కన్నీళ్లనే కౌగిలించుకుంటున్న ఈ పిల్లలు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎప్పుడు పాల్గొంటారనే ప్రశ్న తలెత్తుతోంది.
ఆకలితో అలమటిస్తున్న బాల్యం
ఆకాశంలో జెండా రెపరెపలాడుతుంటే, అదే నేలపై చిన్నారి కళ్లలో ఆకలి రంగు మాత్రమే కనిపిస్తుంటే పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా, ఎంతోమంది పిల్లలు కనీస అవసరాలకు నోచుకోలేకపోతున్నారు.
రైతుల కష్టాలు
దేశం కడుపు నింపిన రైతన్న, తమ కడుపు నింపుకోలేక కరెంట్ కోత, కోతుల బెడద, రుణాల ఉరితాళ్లతో పోరాడుతున్నాడు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అవకాశం వారికి ఎప్పుడు దక్కుతుందోనని ఆవేదన వ్యక్తమవుతోంది.
మహిళల భద్రతపై ప్రశ్నలు
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఆడపిల్ల బయట అడుగు వేస్తే భయంతో వెనక్కి చూసే పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. చట్టాలు కొందరికే పరిమితమై, బాధితుల కన్నీటికి విలువ లేని పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.
నిజమైన స్వాతంత్ర్యం అంటే...
స్వాతంత్ర్యం అంటే కేవలం బ్రిటిష్ సంకెళ్ల నుంచి విముక్తి కాదని, ఆకలి, అనాథ కన్నీటి సంకెళ్ల నుంచి కూడా విముక్తి కావాలని మంజుల పత్తిపాటి అన్నారు. నిజమైన స్వాతంత్ర్యం అంటే మనిషి గుండె భయం లేకుండా కొట్టుకోవాలని, జెండాకు సెల్యూట్ చేస్తున్న చేతులు ఆకలితో ఉన్న చేతిని అక్కున చేర్చుకోవాలని ఆమె అభిప్రాయపడ్డారు.
దేశభక్తితో పాటు మానవత్వం
దేశభక్తి గీతాలు మన హృదయాల్లో చిగురించి, సాటి మనిషిని మనిషిగా చూసే రోజు రావాలని ఆమె ఆకాంక్షించారు. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరాలని, ప్రతి కార్యాలయంలో జాతీయ గీతం ఆలపించాలని సూచించారు.
శుభాకాంక్షలు
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను అర్పించిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని కోరుకుందాం. జై హింద్ వందే మాతరం











