నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని ఝరి బి గ్రామంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ షిందే ఆనందరావు పటేల్ శనివారం పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి, పనుల పురోగతిని సమీక్షించారు.
ఈ సందర్భంగా షిందే ఆనందరావు పటేల్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం పేదల గృహనిర్మాణానికి పెద్దపీట వేస్తోందని, ఇల్లు లేని ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులో పారదర్శకతను పాటిస్తూ, నిధులను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే జమ చేస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల లంచాలకు తావుండదని ఆయన పేర్కొన్నారు.
నిర్మాణ దశలను బట్టి విడతల వారీగా నిధులు మంజూరు అవుతాయని, బేస్మెంట్ స్థాయికి రూ.1 లక్ష, డోర్ లెవెల్ వరకు మరో రూ.1 లక్ష, స్లాబ్ స్థాయికి సుమారు రూ.1.40 లక్షల వరకు లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ అవుతాయని ఆయన వివరించారు. 'గ్రామంలో ఇల్లు లేని వారు పేర్లు అందిస్తే, ఇళ్ల మంజూరుకు కృషి చేస్తాను' అని ఆయన హామీ ఇచ్చారు.
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ముధోల్ మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి, నారాయణరావు పటేల్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ నారాయణరావు పటేల్, మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సాగర్ బాయి రాజన్న, మాజీ జెడ్పిటిసి ఉత్తం భలేరావు బోసి, నందగావ్ మాజీ సర్పంచ్ షేక్ అబ్దుల్ ఘని, మాజీ ఎంపీటీసీ పోశెట్టి, మాజీ ఎంపిటిసి చంద్రశేఖర్ పటేల్, మాజీ ఏఎంసీ డైరెక్టర్ దిగంబర పటేల్, మౌలాఖాన్, బొడ్డోళ్ళ నాగన్నతో పాటు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు.

