ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తూ, పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జీడిఆర్ మెమోరియల్ ట్రస్ట్ నగదు పురస్కారాలను అందజేసి, ఘనంగా సన్మానించింది. గురువారం బైంసాలోని జిడిఆర్ కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లోని ట్రస్ట్ కార్యాలయంలో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో పార్టీకే గ్రామానికి చెందిన ఎస్. కిరణ్య, మెదన్ పూర్ గ్రామానికి చెందిన కే. వైష్ణవి లను ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్ సన్మానించి, నగదు పురస్కారాలను అందించారు. విద్యార్థుల అభినందన సభలో డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్ మాట్లాడుతూ, విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకోవడానికి కష్టపడి చదవడం అవసరమని నొక్కి చెప్పారు.
భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ఉన్నత విద్యలో రాణించి, తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. అటువంటి ప్రతిభావంతులను జీడిఆర్ ట్రస్ట్ ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ వై. సుప్రియ, ట్రస్టు విద్యావిభాగం కార్యదర్శి జాధవ్ పుండలిక్ రావు పాటిల్, పిఆర్ఓ కంఠాళే రఘువీర్ పాటిల్, పిఏ అక్షయ్, విద్యార్థుల తల్లిదండ్రులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రతిభను వెలికితీయడంలో ఈ కార్యక్రమం ఒక ముఖ్యమైన ముందడుగు.
జీడిఆర్ మెమోరియల్ ట్రస్ట్, విద్యార్థుల విద్యాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ, వారిని ప్రోత్సహించడంలో ముందుంటుంది. ఈ సన్మాన కార్యక్రమం విద్యార్థులకు మరింత స్ఫూర్తినిచ్చింది.









