గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లో 26 సంవత్సరాలుగా నిబద్ధతతో సేవలందించిన డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ (డీపీఎం) లంక సుగంధ రాఘవులుకు బుధవారం బోథ్ మండల కేంద్రంలో ఘనంగా వీడ్కోలు పలికారు. ఆమె పదవీ విరమణ సందర్భంగా సహోద్యోగులు సన్మానించి, ఆమె సేవలను కొనియాడారు.
2001లో కమ్యూనిటీ కోఆర్డినేటర్‌గా సెర్ప్‌లో చేరిన సుగంధ రాఘవులు, గ్రామీణ ప్రాంతాలలోని నిరుపేద, గిరిజన మహిళా సంఘాలను ప్రభుత్వ పథకాలతో అనుసంధానించడంలో కీలక పాత్ర పోషించారు. ఆమె సేవలు ఎప్పటికీ మరువలేనివని అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (ఏడీఆర్డీఓ) జాదవ్ గోవిందరావు అన్నారు.
బోథ్, నేరేడిగొండ మండలాల పరిధిలోని ఏపీఎంలు, సీసీలకు, వీవోఏలకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అమలు చేస్తున్న పథకాల లక్ష్యాల సాధనపై ఏర్పాటు చేసిన క్లస్టర్ స్థాయి సమావేశంలో సుగంధ రాఘవులు సేవలను పలువురు స్మరించుకున్నారు. ఆమె నీతి, నిజాయితీలకు మారుపేరని, గ్రామీణ పేద, బడుగు బలహీన వర్గాల మహిళలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఆమెకే దక్కిందని కొనియాడారు.
కమ్యూనిటీ కోఆర్డినేటర్‌గా, బ్యాంక్ లింకేజీ, ఫామ్, నాన్-ఫామ్ రంగాలలో, అలాగే జిల్లాలోని అన్ని మండలాలలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా ఆమె అందించిన సేవలు చిరస్మరణీయమని పలువురు పేర్కొన్నారు. స్నేహశీలి, మృదుభాషి అయిన సుగంధ రాఘవులు వంటి డీపీఎంలు ఈ సంస్థకు దొరకడం అరుదని, ఆమె 26 ఏళ్ల ఉద్యోగ జీవితంలో మంచిని మంచిగా, చెడును చెడుగా ముక్కుసూటిగా వ్యవహరించారని ప్రశంసించారు.
ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న సందర్భంగా, బోథ్, నేరేడిగొండ మండలాల ఏపీఎంలు, సీసీలు, ఆపరేటర్లు, అకౌంటెంట్లు, కార్యాలయ సిబ్బంది ఆమెకు తీయని స్వీట్లు తినిపించి, శాలువాతో సన్మానించారు. ఆమె శేష జీవితాన్ని సుఖసంతోషాలతో, మంచి ఆయుష్షుతో, ఆరోగ్యంతో, అష్టలక్ష్మి కటాక్షంతో, పరమేశ్వరుని ఆశీస్సులతో గడపాలని ఆకాంక్షించారు.












