ఆదిలాబాద్, 2026-06-05
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని సాంగ్వి గ్రామపంచాయతీ పరిధిలోని రాంనగర్‌కు వెళ్లే ప్రధాన రహదారి గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పూర్తిగా బురదమయంగా మారింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని సాంగ్వి గ్రామపంచాయతీ పరిధిలోని రాంనగర్‌కు వెళ్లే ప్రధాన రహదారి గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పూర్తిగా బురదమయంగా మారి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ దుస్థితిపై స్థానికులు, ప్రయాణికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు
ఈ సందర్భంగా సాంగ్వి గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ సుందర్ సింగ్ మాట్లాడుతూ, ప్రభుత్వాలు మారుతున్నా గ్రామీణ రహదారుల దుస్థితి మాత్రం మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా రహదారి సమస్యను పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి శాశ్వత పరిష్కారం లభించలేదని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, రవాణా వ్యవస్థకు ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటామని హామీలు ఇచ్చినప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితుల్లో మార్పు కనిపించడం లేదని విమర్శించారు.
ఎమ్మెల్యే హామీ ఏమైంది
బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఎన్నికల ప్రచార సమయంలో ఈ ప్రాంత రహదారి సమస్యలను ఒక సంవత్సరం లోపే పరిష్కరిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటివరకు ఆ హామీ అమలుకు నోచుకోలేదని సుందర్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజల కష్టాలు
చినుకు పడితేనే రహదారి చిత్తడిగా మారడంతో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు, రైతులు వ్యవసాయ పనులకు వెళ్లేందుకు, గ్రామస్తులు అత్యవసర అవసరాల కోసం రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
శాశ్వత పరిష్కారం కోరారు
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రాంనగర్ రహదారి సమస్యను తక్షణమే పరిష్కరించి, వర్షాకాలంలో ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా శాశ్వత ప్రాతిపదికన రహదారి అభివృద్ధి పనులు చేపట్టాలని సాంగ్వి గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ సుందర్ సింగ్ కోరారు.












