హైదరాబాద్, జులై 22
తెలంగాణ యువతకు విదేశాలలో ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే దిశగా తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్), కెరీర్ కన్సల్ట్జ్ సంస్థల మధ్య ఒక కీలక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ, భాషా శిక్షణ, వీసా సహాయం వంటి పలు సేవలు అందుబాటులోకి రానున్నాయి.
తెలంగాణ యువతకు నైతిక, పారదర్శక, సుస్థిరమైన విదేశీ ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంతో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్), కెరీర్ కన్సల్ట్జ్ సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పంద పత్రాన్ని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి, టామ్‌కామ్ చైర్మన్ గడ్డం వివేక్ వెంకటస్వామి ఆవిష్కరించి అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ యువతకు ప్రపంచ స్థాయి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. టామ్‌కామ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి ఏ. నిర్మల కాంతి వెస్లీ, కెరీర్ కన్సల్ట్జ్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి మేనేని రోహిత్ రావుల మధ్య ఈ ఒప్పందం జరిగింది.
ఈ భాగస్వామ్యం ద్వారా ముఖ్యంగా జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, ఫిన్లాండ్, ఇటలీ, నార్వే వంటి దేశాల్లో ఉద్యోగ అవకాశాలు పొందేందుకు యువతకు నైపుణ్య శిక్షణ, భాషా శిక్షణ, ఉద్యోగ ఇంటర్వ్యూలకు సన్నద్ధత, అవసరమైన పత్రాల తయారీ, వీసా సహాయం, విదేశీ నియామకాలలో సహకారం అందించనున్నట్లు తెలిపారు. విదేశీ ఉపాధి కోసం వెళ్లే యువతకు సరైన మార్గదర్శకత్వం అందించడం, మోసాలకు తావులేకుండా పారదర్శక నియామకాలు చేపట్టడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ అయిన టామ్‌కామ్ నైపుణ్యం కలిగిన యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి నాయకత్వంలో, టామ్‌కామ్ అధికారులు చేపడుతున్న కార్యక్రమాల ద్వారా విదేశీ ఉపాధి వ్యవస్థ మరింత బలోపేతం అవుతోందని పేర్కొన్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా తెలంగాణ నుంచి వేలాది మంది యువతకు ప్రపంచ స్థాయి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని టామ్‌కామ్, కెరీర్ కన్సల్ట్జ్ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, టామ్‌కామ్ జనరల్ మేనేజర్ శ్రీమతి నాగభారతి, టామ్‌కామ్ అధికారులు షబానా, అనిల్, జపాన్ ప్రతినిధి శ్రీమతి సయూరి మత్సునోతో పాటు కెరీర్ కన్సల్ట్జ్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.












