హైదరాబాద్, జులై 18
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్లకు పైగా కుటుంబాల కోసం క్యూఆర్ కోడ్‌తో రూపొందించిన రేషన్ కార్డుల ప్రింటింగ్ ఇప్పటికే పూర్తయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోగానే వీటి పంపిణీ ప్రారంభం కానుంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్త రేషన్ కార్డులపై దృష్టి సారించింది. అందుకు అనుగుణంగా లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్లకు పైగా కుటుంబాల కోసం క్యూఆర్ కోడ్‌తో రూపొందించిన రేషన్ కార్డుల ప్రింటింగ్ ఇప్పటికే పూర్తయింది.
ఈ కొత్త కార్డులను ఆయా జిల్లాలకు సైతం అధికార యంత్రాంగం చేరవేసింది. కార్డుల పంపిణీ తేదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖరారు చేయడమే మిగిలి ఉంది. సీఎం నిర్ణయం తీసుకోగానే, ఆ తేదీ నుంచి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ వర్గాలు చెబుతున్నాయి.
ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను క్రెడిట్, డెబిట్ కార్డు సైజులో తయారు చేశారు. కార్డుపై యజమాని పేరు, అడ్రస్‌తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలను ముద్రించినట్లు సమాచారం.
ప్రస్తుతం రేషన్ కార్డులు కాగితం రూపంలో ఉన్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత క్రెడిట్, డెబిట్ కార్డుల రూపంలో రేషన్ కార్డులు రానుండటం ఇదే తొలిసారి. కార్డుపై క్యూఆర్ కోడ్ ముద్రించి ఉంటుంది. ఆ కోడ్‌ను స్కాన్ చేస్తే రేషన్ లబ్ధిదారులైన ఆ కుటుంబ సభ్యుల వివరాలతో పాటు ఇప్పటి వరకు బియ్యం, చక్కెర, గోధుమలు వంటి రేషన్ వస్తువుల్ని తీసుకున్న పూర్తి వివరాలు కనిపిస్తాయి.






