కరీంనగర్, జులై 30
నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు రోడ్డు గుంతలమయంగా మారింది. రోడ్డు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సామాజిక కార్యకర్తలు గురువారం వినూత్న నిరసన చేపట్టారు. రోడ్డు అధ్వానంగా ఉండటంతో అత్యవసర రోగుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లన్నీ గుంతలమయంగా మారాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు రోడ్డు మరమ్మతులు చేయాలని సామాజిక కార్యకర్తల ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు.
గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే రోడ్డు చాలా అధ్వానంగా ఉందని, గుండె జబ్బులు లేదా ప్రసవానికి వచ్చిన రోగులు ఈ రోడ్డుపై వెళ్తే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న సామాజిక కార్యకర్త అన్నమల్ల సురేష్, 20,000 కోట్ల స్మార్ట్ సిటీ నిధులు ఎక్కడికి వెళ్లాయని ప్రశ్నించారు. నగరంలో అనేక రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని, కోట్లు ఖర్చుపెట్టి నిర్మించాలని చెబుతున్న అధికారులకు, అభివృద్ధి కోసం నిధులు తెచ్చామని చెప్పుకుంటున్న నాయకులకు ఇవి కనిపించడం లేదా అని నిలదీశారు.
మంచి రోడ్లు నిర్మించి, అందమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రజలకు కల్పిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న నాయకులు, అధికారులు అభివృద్ధి విషయంలో మాత్రం శూన్యమని విమర్శించారు.
పట్టణంలో రోడ్ల దుస్థితి ఎలా ఉందో ఒకసారి రోడ్లపైకి వచ్చి చూస్తే అధికారులకు, నాయకులకు అర్థమవుతుందని, నిధులు మింగడమే తప్ప పనులు మాత్రం చేయరని తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికైనా నాయకులు, అధికారులు స్పందించి ఈ గుంతల రోడ్లను బాగు చేయాలని వారు డిమాండ్ చేశారు.












