(కె) (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 28
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, భూగర్భ జలాల సంరక్షణకు ఫామ్ పాండ్లను విసృతంగా నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. మంగళవారం నిర్మల్ గ్రామీణ మండలం కౌట్ల (కె) గ్రామంలో పర్యటించిన ఆయన, లబ్ధిదారు మూడ నాగవ్వ ఇంటి గృహ ప్రవేశంలో పాల్గొన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు అందించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, నిర్మల్ గ్రామీణ మండలం కౌట్ల (కె) గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన లబ్ధిదారు మూడ నాగవ్వ కు చెందిన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశంలో పాల్గొన్నారు. లబ్ధిదారురాలు, అధికారులతో కలిసి రిబ్బను కత్తిరించి గృహ ప్రవేశం చేశారు. అనంతరం ఇంటిని మొత్తాన్ని పరిశీలించారు. ఇప్పటివరకు అందిన డబ్బుల వివరాలు వారిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇంటిని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. హట్ సర్వేను పరిశీలించారు.
అంతకుముందు గ్రామ శివారులో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను పరిశీలించారు. ఇండ్లకు సంబంధించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కల్పించిన వసతులను వాకబు చేశారు. విద్యుత్, త్రాగునీరు, డ్రైనేజీ వంటి మౌళిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో మాట్లాడుతూ, గ్రామస్తుల వినతి మేరకు కేటాయింపు పూర్తి అవగా మిగిలిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అర్హులకు అందిస్తామన్నారు. ఇళ్ల స్థలాలు లేని అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. సొంత స్థలాలు ఉన్న ఇళ్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని తెలిపారు.
గ్రామంలో నిర్మిస్తున్న ఫామ్ పాండ్ ను పరిశీలించారు. రైతులంతా ఫామ్ పాండ్ ల నిర్మాణాలకు ముందుకు రావాలని అన్నారు. భూగర్భ జలాల సంరక్షణకు విసృతంగా ఫామ్ పాండ్ లు నిర్మించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమాలలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, హౌసింగ్ పిడి శ్రీనివాస్ రెడ్డి, తహసిల్దార్ ప్రభాకర్, మున్సిపల్ కమిషనర్ రవి బాబు, ఎంపీడీఓ సుధాకర్, సర్పంచ్ దుమాల రాజు, ఉప సర్పంచ్ రఘు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.












