హైదరాబాద్, శుక్రవారం
ఉద్యోగాలు, ఉన్నత చదువుల కోసం నగరానికి వచ్చే మహిళలు, విద్యార్థినుల భద్రతను పటిష్ఠం చేసేందుకు హైదరాబాద్ సిటీ పోలీస్ 'ప్రాజెక్ట్ సేఫ్ స్టే' కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో హాస్టళ్లు, పీజీల నిర్వాహకులకు కొత్త మార్గదర్శకాలు జారీ చేయబడ్డాయి.
ఉద్యోగాలు, ఉన్నత చదువుల కోసం నగరానికి వచ్చే మహిళలు, విద్యార్థినుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ హైదరాబాద్ సిటీ పోలీస్ కీలక అడుగు వేసింది. వారికి మరింత సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడమే ధ్యేయంగా హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సంస్థలతో కలిసి సంయుక్తంగా 'ప్రాజెక్ట్ సేఫ్ స్టే' కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఈ ప్రాజెక్టులో భాగంగా మొదటి దశ కింద రూపొందించిన 'సురక్ష నివాస్ 1.O' మార్గదర్శకాల బ్రోచర్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సంయుక్తంగా ఆవిష్కరించారు. అనంతరం కమిషనరేట్ పరిధిలోని హాస్టళ్లు, పీజీల నిర్వహణ, మహిళా భద్రతపై ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో వారు పాల్గొని నిర్వాహకులకు దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా సీపీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ, నగర పరిధిలోని ప్రతి మహిళా హాస్టల్, పీజీ నిర్వాహకులు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లో తప్పనిసరిగా పేరు నమోదు చేసుకోవాలని స్పష్టం చేశారు. మహిళల భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు నూతనంగా అమల్లోకి తెచ్చిన రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ కింద నిర్దేశిత ఫామ్-ఏ ను పూర్తి చేసి స్థానిక పోలీసులకు సమర్పించాలన్నారు. వసతి గృహాల్లో భద్రతా ప్రమాణాలపై తాము నిర్వహించిన సర్వేలో కొన్ని లోపాలు వెలుగు చూశాయని తెలిపారు. మొత్తం 10 ప్రత్యేక బృందాలతో నగర పరిధిలోని 447 మహిళా హాస్టళ్లలో క్షేత్రస్థాయి పరిశీలన జరపగా, దాదాపు 97.5 శాతం హాస్టళ్లలో సీసీటీవీ కెమెరాలు ఉన్నప్పటికీ, కేవలం 43 శాతం వసతి గృహాలకు మాత్రమే సరైన కాంపౌండ్ వాల్స్ ఉన్నట్లు తేలిందన్నారు. అలాగే అత్యంత కీలకమైన అగ్నిమాపక పరికరాలు కేవలం 38.9 శాతం హాస్టళ్లలోనే అందుబాటులో ఉన్నాయని అన్నారు.
ఈ విభాగాల్లో తక్షణమే మార్పులు రావాల్సిన అవసరం ఉందని, భద్రతా లోపాలను సవరించడమే లక్ష్యంగా ఈ నూతన విధానాన్ని ప్రవేశపెట్టామని సీపీ పేర్కొన్నారు. ఈ నియమ నిబంధనలు హాస్టల్ యాజమాన్యాలను ఇబ్బంది పెట్టడానికి లేదా అదనపు ఆంక్షలు విధించడానికి ఉద్దేశించినవి కావని, కనీస భద్రతా ప్రమాణాలను నెలకొల్పి మహిళలకు జవాబుదారీతనంతో కూడిన రక్షణ కల్పించడమే పోలీసుల ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. త్వరలోనే హాస్టళ్లలో మహిళా భద్రతకై ఒక ప్రత్యేక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని, భవిష్యత్తులోనూ పోలీసులు వసతి గృహాలను నిరంతరం పర్యవేక్షిస్తూ నిర్వాహకులకు తగిన మార్గదర్శకత్వం అందిస్తారని వెల్లడించారు.
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ, హాస్టళ్ల నిర్వాహకులు చట్టపరమైన నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ నివాసితులకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున భవనాలను సమూహంగా తీసుకుని హాస్టల్ రూపంలో నడపడం 'వ్యాపారం' కిందికే వస్తుందని, ఈ నేపథ్యంలో నిర్వాహకులందరూ వెంటనే మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని, దీని ఆధారంగానే భద్రతా ప్రమాణాల అమలు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. హాస్టళ్లలో భోజనం, వసతి సదుపాయాలు కల్పించే వారు చట్టప్రకారం కచ్చితంగా ‘ఎఫ్ఎస్ఎస్ఏఐ’ లైసెన్స్ కలిగి ఉండాలని, లేనిపక్షంలో వాటిని అనధికారిక వసతి గృహాలుగానే పరిగణిస్తామని హెచ్చరించారు. పోలీస్ నిబంధనల ప్రకారం హాస్టల్‌కు వచ్చే, వెళ్లే వారి పూర్తి వివరాలతో కూడిన పక్కా రిజిస్ట్రేషన్ల నిర్వహణ తప్పనిసరి అని, హాస్టళ్లలో పనిచేసే సిబ్బంది అందరికీ కచ్చితంగా సెక్యూరిటీ చెకప్ నిర్వహించాల్సిన బాధ్యత యాజమాన్యాలదేనని స్పష్టం చేశారు.












