రంగారెడ్డి, జూలై 9
తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్‌లో ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ ఏర్పాటు చేసిన అత్యాధునిక సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్‌ను ఆయన గురువారం ప్రారంభించారు.
తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్‌లో ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ ఏర్పాటు చేసిన అత్యాధునిక సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించారు. అనంతరం యూనిట్‌లోని వివిధ ఉత్పత్తి విభాగాలను పరిశీలించి, తయారీ ప్రక్రియను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, "తెలంగాణ రైజింగ్–2047" విజన్‌తో రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోందన్నారు. ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించేందుకు అత్యాధునిక మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అనుకూల విధానాలు, వేగవంతమైన అనుమతుల వ్యవస్థను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు.
హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాలను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తూ, ఆధునిక పారిశ్రామిక మండలాల ఏర్పాటు, సేవా రంగ విస్తరణ, రవాణా మౌలిక సదుపాయాల బలోపేతంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. యువతకు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు స్కిల్స్ యూనివర్సిటీ, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లు, పాలిటెక్నిక్ కళాశాలలు, ఐటీఐలను ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు.
సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా సౌరశక్తి వినియోగాన్ని విస్తరిస్తూ పర్యావరణ హిత పారిశ్రామికీకరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రీమియర్ ఎనర్జీస్ వంటి సంస్థలు రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరుతూ, పరిశ్రమలకు అవసరమైన అన్ని విధాల సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు.
సీతారాంపూర్‌లో పరిశ్రమ ఏర్పాటుతో భూములు కోల్పోయిన కుటుంబాల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. అర్హులైన వారికి ఇంటి పట్టాలు, ఉపాధి అవకాశాలు, వ్యాపార సముదాయాల ఏర్పాటు వంటి చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా రైతులు చేసిన త్యాగాల వల్లే ఈ పారిశ్రామిక అభివృద్ధి సాధ్యమైందని ముఖ్యమంత్రి కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణను 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, ఉత్పత్తి కేంద్రంగా తెలంగాణను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.











