Assam, 30 July
అస్సాం రాష్ట్రంలో భారీ వరదలు బీభత్సం సృష్టించాయి. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ASDMA) తాజా నివేదిక ప్రకారం, వరదల కారణంగా మృతుల సంఖ్య 78కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఏడు జిల్లాల్లో 3 లక్షలకు పైగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అస్సాంలో సంభవించిన భారీ వరదలు తీరని విషాదాన్ని మిగిల్చాయి. అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ASDMA) విడుదల చేసిన తాజా హెచ్చరిక ప్రకారం, శివసాగర్ జిల్లాలో ఇద్దరు, గోలాఘాట్లో ఒకరు మరణించడంతో వరద మృతుల సంఖ్య ఏకంగా 78కి చేరింది.
రాష్ట్రవ్యాప్తంగా ఏడు జిల్లాల్లో ఇప్పటికీ 3 లక్షలకు పైగా ప్రజలు వరద కష్టాల్లో మునిగిపోయారు. 21 రెవెన్యూ సర్కిళ్ల పరిధిలోని 551 గ్రామాలు నీటమునిగాయి. సుమారు 21,523 హెక్టార్ల పంట పొలాలు మునిగిపోయి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి.
బాధిత జిల్లాల్లో చరాయిదేవు పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంది. ఇక్కడ ఏకంగా 1.37 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఆ తర్వాత శివసాగర్, జోర్హాట్ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ప్రస్తుతం 71 పునరావాస కేంద్రాల్లో 16,500 మందికి పైగా ఆశ్రయం పొందుతుండగా, మరో 72,000 మందికి 30 సహాయ కేంద్రాల ద్వారా నిత్యావసరాలు అందిస్తున్నారు.
వరద తాకిడికి మౌలిక వసతులు, రోడ్లు, పాఠశాలలు ధ్వంసమవ్వడమే కాకుండా.. 11,000కు పైగా జీవాలు కొట్టుకుపోయాయి. మరో వైపు రాజధాని గువాహటితో పాటు కామరూప్ మెట్రోపాలిటన్ జిల్లాలో అర్బన్ ఫ్లడ్డింగ్ (పట్టణ వరదలు) ఇంకా వీడలేదు. పడుంబరి, బోరాగావ్, జూ రోడ్, హాతిగావ్ వంటి అనేక ప్రాంతాలు బురద, నీటితో నిండిపోయాయి.












