అమరావతి, 2026-08-31
రెండేళ్లుగా సంయమనం పాటిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల్లో సహనం నశిస్తోందని ఏపీజేఏసీ ఛైర్మన్ ఎ. విద్యాసాగర్, సెక్రటరీ జనరల్ కె.ఎస్.ఎస్. ప్రసాద్ తెలిపారు. పీఆర్సీ, డీఏ బకాయిలు, సరెండర్ లీవ్‌లు వంటి సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని, లేదంటే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.
రెండేళ్లుగా సంయమనం పాటిస్తూ, బాధ్యతతో ప్రభుత్వానికి సహకరిస్తున్నప్పటికీ సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల్లో సహనం నశిస్తోందని ఏపీజేఏసీ ఛైర్మన్ ఎ. విద్యాసాగర్, సెక్రటరీ జనరల్ కె.ఎస్.ఎస్. ప్రసాద్ తెలిపారు. విజయవాడలోని ఏపీఎన్జిఒ కార్యాలయంలో ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. పీఆర్సీ, డీఏలు చెల్లిస్తామని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారని, వాటిని అమలు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారని తెలిపారు.
సరెండర్ లీవ్‌లు, ఇతర బకాయిలతో పాటు కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ఇకనైనా ప్రభుత్వం స్పందించి చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 5వ తేదీన ఉద్యోగ సంఘాలతో జరిగే జేఏసీ సమావేశంలోపు పరిష్కార మార్గాలను చూపకపోతే ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు. ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరిస్తామని మంత్రివర్గ ఉపసంఘం, జేఏసీ సంఘాలతో జరిపిన సమావేశంలో హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.
ఇప్పటి వరకు పీఆర్సీ, డీఏలు, ఇతర బకాయిలపై ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదన్నారు. ప్రభుత్వం విడతల వారీగానైనా పెండింగ్ డీఏలను చెల్లించాలని కోరారు. 2020 నుంచి సరెండర్ లీవ్‌ల చెల్లింపులు నిలిచిపోయాయని, వాటిని కూడా వెంటనే చెల్లించాల్సిన అవసరం ఉందని అన్నారు. హెల్త్ కార్డులు, పెన్షనర్లకు అదనపు క్వాంటం పెన్షన్, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయన్నారు.
ఉద్యమాలు, సమ్మెలు తమకు కొత్త కాదని, ప్రస్తుతం విషయం చర్చల స్థాయిలో ఉన్నందున సంయమనం పాటిస్తున్నామని తెలిపారు. లక్షలాది మంది ఉద్యోగులు కూడా జేఏసీ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. చర్చలకు పిలిచి 5వ తేదీ లోపు పరిష్కార మార్గాలు ప్రకటించాలని, లేదంటే తప్పనిసరిగా ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో జేఏసీ నాయకులు ఎ. సాంబశివరావు, కె. బసవలింగేశ్వరరావు, డి. వెంకటేశ్వర్లు, పి. రాజు, జానీ పాషా షేక్, పి.వి. సాయికుమార్, మహమ్మద్ ఆరిఫ్, కె. వెంకటేశ్వరరావు, ఎస్.ఎల్. సోమయాజులు, జి.వి.ఎస్. రామకృష్ణ, డి. చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.












