ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, ఎన్నికల హామీల మేరకు అర్హులైన పేదల సొంతింటి కలను నెరవేర్చడమే తమ లక్ష్యమని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) అన్నారు. ఆదివారం, మండలంలోని దుబ్బ తండా గ్రామ పంచాయతీ పరిధిలో మాలోత్ శివ - జ్యోతి దంపతుల నూతన ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుతో పాటు, అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహ జ్యోతి, రైతు భరోసా, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ వంటి పథకాలను అమలు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో మార్పు తెస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ పథకాల లబ్ధిదారులు ప్రభుత్వ ప్రచారకర్తలుగా వ్యవహరించి, పథకాలపై విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు.
ప్రజా ప్రభుత్వం చేపడుతున్న ప్రజా రంజక సంక్షేమ పథకాలు ప్రజలకు అండగా నిలుస్తున్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అర్హులైన ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.








