తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగానికి 24 గంటల నిరంతరాయ విద్యుత్ సరఫరా హామీ నెరవేరడం లేదని, పవర్ కట్స్ ప్రారంభమయ్యాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వ్యవసాయానికి 14 గంటలకు మించి విద్యుత్ అందడం లేదని, ఇది రైతులను ఆందోళనకు గురిచేస్తోందని తెలుస్తోంది.
గతంలో 16 గంటల పాటు విద్యుత్ సరఫరా జరిగేదని, ఇప్పుడు అది 14 గంటలకు తగ్గిపోయిందని సబ్స్టేషన్ల లాగ్ బుక్స్ కూడా చెబుతున్నాయని సమాచారం. కొన్ని ప్రాంతాల్లో, విద్యుత్ సరఫరాలో షెడ్యూల్స్ రూపొందించి, త్రీఫేజ్ కరెంటును నిర్దిష్ట సమయాల్లో మాత్రమే అందిస్తున్నారని, మిగిలిన సమయంలో సింగిల్ ఫేజ్‌కు మారుస్తున్నారని సోషల్ మీడియాలో వాట్సాప్ సందేశాలు వైరల్ అవుతున్నాయి. ఇది రైతుల సాగుకు తీవ్ర ఆటంకం కలిగిస్తోందని విమర్శలు వస్తున్నాయి.
రాష్ట్రంలో పీక్ డిమాండ్ సమయాల్లో, ముఖ్యంగా ఉదయం 6-9 గంటల మధ్య, సాయంత్రం 6-9 గంటల మధ్య, చాలా ప్రాంతాల్లో త్రీఫేజ్ విద్యుత్ సరఫరా నిలిచిపోతోందని స్థానికులు చెబుతున్నారు. వికారాబాద్, సంగారెడ్డి వంటి జిల్లాల్లో ఉదయం 7-8 గంటల ప్రాంతంలో, సాయంత్రం 4:30-5 గంటల ప్రాంతంలో త్రీఫేజ్ కరెంట్ కట్ చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. ఈ సమయంలో కరెంట్ సరఫరా చేయాలంటే బహిరంగ మార్కెట్లో అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేయాల్సి ఉంటుందని, అందుకే ప్రభుత్వం ఈ కోత విధిస్తోందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉండగా, రాష్ట్రంలోని సాగునీటిపారుదల శాఖ చేపట్టిన పలు మేజర్ ప్రాజెక్టులు, లిఫ్ట్ స్కీమ్‌లకు సంబంధించి ట్రాన్స్‌కోకు దాదాపు రూ. 33,653 కోట్ల నిధులు చెల్లించాల్సి ఉంది. ఇందులో పంప్ హౌస్ ల నిర్వహణ, విద్యుత్ బిల్లులు, నిర్మాణ పనులకు సంబంధించిన బకాయిలు ఉన్నాయని సమాచారం. అత్యవసరంగా కనీసం రూ. 500 కోట్లైనా చెల్లించాలని ట్రాన్స్‌కో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా స్పందన లేదని, ఈ నేపథ్యంలోనే 24 గంటల కరెంట్ సరఫరా నిలిపివేసి, పగటిపూట మాత్రమే కరెంట్ ఇస్తామని ట్రాన్స్‌కో తేల్చి చెప్పిందని తెలుస్తోంది.
రిజర్వాయర్లలో నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నప్పటికీ, ట్రాన్స్‌కో పగటిపూట మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తుండటంతో, ఆయా లిఫ్ట్ పథకాలను వినియోగించుకోలేని దుస్థితి నెలకొందని అధికారులు వాపోతున్నారు. కీలక దశలో సాగునీరందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ స్థాయిలోనే ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని ఇంజినీర్లు స్పష్టం చేస్తున్నారు.








