కుబీర్ మండలం లోని సౌన గ్రామస్తులకు కేటాయించిన ఇండ్ల స్థలాల భూమిని వెంటనే సర్వే చేసి, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకెఎంఎస్) నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జే. రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం భైంసా సబ్‌కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
1983లో వరదల కారణంగా ఇళ్లను కోల్పోయిన సౌన గ్రామ ప్రజలకు సర్వే నంబర్ 10లో భూమిని కేటాయించి పట్టాలు ఇచ్చినప్పటికీ, ఇప్పటివరకు ఆ భూమిని కొలిచి ప్లాట్ల కేటాయింపు జరగలేదని ఆయన తెలిపారు. దీంతో గ్రామస్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ప్రతి సంవత్సరం వరదలతో వాగు నీరు గ్రామంలోకి చేరి ఇళ్లలోని నిత్యావసర వస్తువులు మునిగిపోతున్నాయని, వాగు ఒడ్డున నివసించడం వల్ల పాములు, తేళ్లు వంటి ప్రాణులు ఇళ్లలోకి వస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి భూమిని సర్వే చేసి, ఇండ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఏఐకెఎంఎస్ కోరింది. వినతిపత్రంపై స్పందించిన సబ్‌కలెక్టర్ భూమి సర్వే నిర్వహిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో శేషరావు పటేల్, గ్రామ ఉపసర్పంచ్ గణపతి, మారుతీ పటేల్, చంద్రే భీమ్రావు, కే. మారుతీ, సీహెచ్ లక్ష్మన్, భోజరం సీహెచ్ తదితరులు పాల్గొన్నారు.








