ప్రభుత్వం తక్షణమే ఆర్టీసీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా కేంద్రంలో ఆర్టీసీ ఉద్యోగులు చేపట్టిన సమ్మెకు ఆయన సంఘీభావం తెలిపారు.
ప్రజలకు సేవలు అందించే సంస్థను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల పట్ల కేవలం ఈ ప్రభుత్వమే కాదు, గత ప్రభుత్వం కూడా కక్ష కట్టిందని, 52 రోజుల సమ్మెకు దిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి, విలీనం చేయకుండా గత ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంలో విలీనం చేస్తామని, సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి, అదే బాటలో నడుస్తోందని అన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, పట్టణ కౌన్సిలర్ జింక సూరి, గంజి రాజు, ఒడిసెల అర్జున్, పట్టణ బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.
ఆర్టీసీ ఉద్యోగుల ప్రధాన డిమాండ్లలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనాలు కల్పించడం, పెండింగ్ డీఏ మరియు బకాయిలు చెల్లించడం, పిఎఫ్, సిసిఎస్ బకాయిలు చెల్లించడం, కార్మిక సంఘ ఎన్నికలు నిర్వహించడం, రిటైర్డ్ ఉద్యోగుల ప్రయోజనాలు కల్పించడం, ఉద్యోగ భద్రతతో పాటు కొత్త నియామకాలు చేపట్టడం వంటివి ఉన్నాయి.












