రాబోయే రంజాన్ పండుగ సందర్భంగా భైంసా పట్టణంలో శాంతిభద్రతలను పటిష్టంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల, ఐపీఎస్ బుధవారం పరిశీలించారు. ఈద్గా వద్ద భద్రతా ఏర్పాట్లపై అధికారులకు ఆమె పలు సూచనలు చేశారు.
భైంసాలోని గడ్డన్నవాగు వద్ద ఉన్న ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ డా.జి.జానకి షర్మిల నిశితంగా పరిశీలించారు. రంజాన్ పండుగ సందర్భంగా పెద్ద సంఖ్యలో ముస్లింలు ప్రార్థనల కోసం ఈద్గాను సందర్శించే అవకాశం ఉన్నందున, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సదుపాయాలు, ప్రజల రాకపోకల నిర్వహణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆమె సూచించారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించి పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. 'నిర్మల్ పోలీస్... మీ పోలీస్' నినాదంతో ప్రజలకు భద్రత కల్పించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు.
ఈ పరిశీలనలో ఏఎస్పీ సాయి కిరణ్, ఇన్స్పెక్టర్లు, ఆర్.ఐ లు, ఎస్.ఐ లు, ఆర్.ఎస్.ఐ లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పండుగ వేడుకలు సజావుగా సాగేలా అన్ని చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.








