స్పెషల్ ఇంటెన్సివ్ సమ్మరీ రెవిజన్ (ఎస్ఐఆర్)లో భాగంగా జరుగుతున్న మ్యాపింగ్ పనుల పురోగతిపై మిర్యాలగూడ సబ్ కలెక్టర్ ఎం. నారాయణ్ అమిత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు వేగవంతం చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
మిర్యాలగూడ సబ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల, ఓటర్ నమోదు అధికారి ఎం. నారాయణ్ అమిత్ శనివారం స్థానిక సబ్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ఏనుమరేటర్లు, బూత్ లెవెల్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ మ్యాపింగ్ పనుల తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
నియోజకవర్గంలో 50 శాతం మ్యాపింగ్ పూర్తయినా, మిర్యాలగూడ పట్టణంలో మాత్రం చాలా తక్కువగా జరిగిందని, కొన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో కేవలం 1, 2, 3 శాతం మాత్రమే పూర్తయిందని ఆయన తెలిపారు. ఈ పనితీరుపై ముగ్గురు బూత్ ఆఫీసర్లపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పట్టణంలో మ్యాపింగ్ పనులు నెమ్మదిగా జరుగుతున్నాయని ఉన్నతాధికారులు ప్రశ్నిస్తున్నారని, ఈ పరిస్థితిని మెరుగుపరచాలని ఆయన సూచించారు. రాబోయే 10 రోజుల్లో కనీసం 70 శాతం మ్యాపింగ్ పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. మే నెలలో వచ్చే సెలవుల్లో కూడా పని చేయాలని ఆయన కోరారు.
అప్పగించిన పనులను పూర్తి అవగాహనతో చేయాలని ఐసీడిఎస్ అర్బన్ ప్రాజెక్టు ఆఫీసర్ రేఖల మమత సూచించారు. మ్యాపింగ్ పనులు సత్వరం జరిగేలా చురుకుగా పని చేయాలని ఆమె అధికారులను కోరారు. ఈ సమావేశంలో తహసీల్దార్ పి. శ్రీనివాస్, మెప్మా టీఎంసి పి. బక్కయ్యలు పాల్గొన్నారు.












